హాయ్.. నేను మీ లెఫ్ట్ హ్యాండ్ ని. మీ శరీరంలో ఓ భాగాన్ని. కానీ కొన్ని సందర్భాల్లో నన్ను మీరు చాలా చిన్నచూపుతో చూస్తున్నారు. ఆరంభించే పనుల్లో, పూజల్లో, షాపుల్లో డబ్బు ఇచ్చే సందర్భాల్లోనూ కుడి చేతికే ప్రాధాన్యత ఇవ్వాలని ఎంతో మంది చెబుతున్నారు. ఎడమచేతితో పనులు చేయడాన్ని ఇప్పటికీ అశుభంగా భావించేవారూ ఉన్నారు. తినే ఆహారం కూడా కుడి చేత్తో తింటేనే సరైన పద్ధతి అని అంటున్నారు. తినడానికి కావాల్సింది శుభ్రత కదా, లెఫ్టా, రైటా ఏంటి? ఉన్న రెండు చేతుల్లో కూడా ఎందుకు ఈ భేదం? అందుకే నన్ను ప్రోత్సహించే వారికి ఈ రోజు స్పెషల్ డే. అదే ఇవాళ ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే. ఈ సందర్భంగా మీకు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాలనుకుంటున్నా..!!!
కుడి చేతివాటం, ఎడమ చేతి వాటం ఎందుకు వస్తుందనే విషయంపై ఇప్పటికీ వైద్యులకే క్లారిటీ లేదు. శరీర అంతర్నిర్మాణ పనితీరు వల్ల వస్తుందని కొందరు వాదిస్తున్నారు. మెదడులోని ఉండే కుడి, ఎడమ అర్ధభాగాల వల్ల అని మరికొందరు చెబుతున్నారు. మష్తిష్కంలోని కుడి అర్ధభాగం బలంగా ఉంటే ఎడమచేతి వాటం రావొచ్చని వివరిస్తున్నారు. జన్యుపరంగా వస్తాయని కూడా అంటున్నారు. అయితే వీటిపై స్పష్టత లేదు. కానీ రైట్ హ్యాండర్స్తో పోలిస్తే లెఫ్ట్ హ్యాండర్స్లోనే ఐక్యూ లెవల్ ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. భావ ప్రకటన, సామర్థ్యం, మెదడు చురుకుదనం లెఫ్టీస్కే ఎక్కువగా అంటున్నారు. నన్ను ఎంకరేజ్ చేస్తే అట్లుంటది మరి!
ప్రముఖ వ్యక్తుల్లోనూ లెఫ్ట్ హ్యాండర్సే ఎక్కువగా ఉంటారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ముందుండి ఆంగ్లేయులను తరిమికొట్టిన మహాత్మ గాంధీ ఎడమచేతి వాటమే. ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా లెఫ్ట్ హ్యాండరే. అమితాబ్ బచ్చాన్, సచిన్ తెందుల్కర్, చార్లీ చాప్లిన్, స్టీవ్ జాబ్స్, బిల్గేట్స్, బరాక్ ఒబామా ఇలా ఎంతో మంది నన్ను ప్రోత్సహించే వారే. టాప్ టెన్నిస్ ప్లేయర్లలో దాదాపు 40 శాతం మంది లెఫ్టీసే. ఇక క్రికెట్లో నా చేతివాటం వారికి ఫుల్ డిమాండ్. కాస్త టాలెంట్ ఉండి ఎడమచేతి వాటం బౌలర్, బ్యాట్స్మెన్ అయితే చాలు.. జట్టులో మీ ప్లేస్ ఫిక్స్.
అయితే మా లెఫ్ట్ హ్యాండర్స్ కష్టాలు మీకు ఎవరికీ పట్టవు. అందుకే సాధారణంగా ఇంట్లో ఉపయోగించే వస్తువులు కూడా కుడిచేతివాటం వారికి అనుగుణంగా తయారుచేస్తారు. స్కూల్స్లో ఉండే కుర్చీల్లోనూ రైటింగ్ ప్యాడ్ కుడిచేతి వైపే ఉంచుతారు. మా పరిస్థితి ఎలా అని ఎవరికీ ఆలోచన లేదు. కానీ ఈ మధ్య మా కష్టాలను కొన్ని కంపెనీలు గుర్తిస్తున్నాయి. మా కోసం వస్తువులు తయారుచేస్తున్నాయి. ఈ విషయంలో కాస్త హ్యాపీగా ఉంది. సరే, మొత్తంగా నన్ను ప్రోత్సహించే వారికి హ్యాపీ ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే.