తన కుమారై భయపడిందనే కారణంతో గుడిలోకి చొరబడిన టెర్రరిస్టును ఓ తండ్రి కొట్టాడు. చెంప పగలగొట్టి, బుద్ధి లేదా అని ఉగ్రవాదిపై విరుచుకుపడ్డాడు. అయితే అప్పుడే ఓ ట్విస్ట్. అది పోలీసులచే నిర్వహించిన మాక్ డ్రిల్. ఈ ఘటన మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే.. ధూలే ప్రాంతంలోని రద్దీగా ఉన్న శ్రీ స్వామి నారాయణ ఆలయ ప్రాంగణంలోకి కొందరు ఉగ్రవాదులలా చొరబడ్డారు. మాస్క్‌లతో, తుపాకులతో వచ్చారు. ఓ భక్తుడు తలపై గన్ గురిపెట్టి బెదిరించారు. దీంతో అక్కడ ఉన్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. పిల్లలు భయపడి ఏడ్చారు. అయితే తన కుమారైతో పాటు భక్తులందరూ ప్రమాదంలో ఉన్నట్లు భావించిన ప్రశాంత్ కులకర్ణి అనే వ్యక్తి సాహసానికి పాల్పడ్డాడు. ధైర్యంగా ముందుకెళ్లి గన్‌పెట్టి బెదిరిస్తోన్న టెర్రరిస్టుపై విరుచుకుపడ్డాడు. చెంప పగలగొట్టి.. మీకసలు బుద్ధుందా అని అరిచాడు.
అయితే అప్పుడే అసలు ట్విస్ట్ తెలిసింది. ఇదంతా పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్‌లో భాగమని తెలిసింది. దీంతో అక్కడి భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం దీనిపై స్పందించిన ప్రశాంత్.. తన కుమార్తె భయపడటం వల్లే ఆగ్రహంతో అలా చేశానని వివరించాడు.