కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది. ఫోన్‌లో ఇంటర్నెట్ డేటా లేకుండానే TV, OTT ప్రసారాలు చూడొచ్చు. ‘డైరెక్ట్ 2 మొబైల్’ (D2M) టెక్నాలజీతో మనం వీక్షించవచ్చు. బ్రాడ్ బాండ్, బ్రాడ్ కాస్ట్ సమ్మేళనమే ఈ డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీ. మొబైల్స్‌లో FM రేడియో ట్రాన్స్‌మిషన్ తరహాలోనే D2M టెక్నాలజీ రూపుదిద్దుకుంటుంది. ఇది రేడియో తరంగాలను ఫోన్ రిసీవర్ స్వీకరిస్తుంది. ప్రస్తుతం టీవీ చానళ్ల ప్రసారానికి వాడుతున్న 526-582 MHz బాండ్‌ను D2Mలో వినియోగం కోసం కసరత్తు జరుగుతోంది.
ప్రస్తుతం దేశంలో సుమారు 22 కోట్ల కుటుంబాలకు టీవీలు, 80 కోట్ల మందికి పైగా ఫోన్లు వినియోగిస్తున్నారు. 2026 నాటికి మొబైల్ యూజర్ల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. సుమారు 100 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో అతిపెద్ద కంటెంట్ వేదికగా మొబైల్ ఫోన్లు మరోస్థాయిలో నిలుస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మొబైల్ వినియోగదారులే లక్ష్యంగా కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది.
మరోవైపు ఈ డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే టెలిఫోన్ ఆపరేటర్లకు నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వారి డేటా రెవెన్యూలో దాదాపు 80 శాతం పడిపోయే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ D2M ప్రతిపాదనలపై టెలికా ఆపరేటర్లు నిరసన తెలిపే అవకాశాలున్నాయి.