CR Rao: ప్రఖ్యాత గణిత మేధావి సీఆర్‌ రావు కన్నుమూత

ప్రఖ్యాత గణిత మేధావి డాక్టర్‌ కల్యంపూడి రాధాకృష్ణారావు (102) కన్నుమూశారు. అమెరికాలో ఉన్న ఆయన అనారోగ్యంతో నేడు తుదిశ్వాస విడిచారు. తెలుగు కుటుంబంలో జన్మించిన ఆయన గణిత శాస్త్రంలో దాదాపు 8 దశాబ్దాలు విశిష్ట సేవలు అందించారు. దానికిగానూ ఎన్నో అవార్డులు అందుకున్నారు. గణిత రంగంలో నోబెల్‌గా భావించే ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అవార్డును ఈ ఏడాది అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనను 1968లో పద్మభూషణ్‌, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్న ఆయన 477 పరిశోధన పత్రాలు సమర్పించారు. 2002లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ సైన్స్‌ పురస్కారం అందుకున్నారు.

సీఆర్‌ రావు 1920 సెప్టెంబరు 10న బళ్లారి జిల్లా హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ గణితం చేసిన ఆయన యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతాలో ఎంఏ స్టాటిస్టిక్స్‌ చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్‌ కాలేజీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగి, పదవీ విరమణ చేశారు. అనంతరం అమెరికాలో స్థిరపడి.. యూనివర్సిటీ ఆఫ్‌ బఫెలోలో రీసెర్చ్‌ ప్రొఫెసర్‌గా సేవలందించారు.

‘గణిత నోబెల్‌’ను 102 ఏళ్ల వయసులో ఈ ఏడాది ఆయన అందుకున్నారు. 1945లో కోల్‌కతా మేథమేటికల్‌ సొసైటీలో ప్రచురితమైన పరిశోధన పత్రానికి ఈ అవార్డు దక్కింది. తన పరిశోధనలో భాగంగా 1945లో మూడు ప్రాథమిక ఫలితాలను విశ్లేషించారు. ఇవి ఆధునిక గణాంక విధానానికి మార్గం సుగమం చేయడంతోపాటు సైన్స్‌లో ఈ గణాంక టూల్స్‌ను భారీగా వాడటానికి ఉపయోగపడ్డాయి. కాగా, ఆయన మృతి పట్ల ప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం