ఆస్ట్రేలియాపై గొప్పగా పోరాడి జట్టును గెలిపించిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లిని చూసి యువ ప్లేయర్లు క్రికెట్ పాఠాలు నేర్చుకోవాలని సూచించాడు. ”జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తక్కువ రిస్క్ ఉన్న షాట్స్ ఆడాలి. తొలుత కుదురుకోవాలి, తర్వాత నెమ్మదిగా పైచేయి సాధించాలి. కోహ్లి అలానే చేశాడు. అందుకే విరాట్ ఇప్పటికీ సాధికారంగా పరుగులు చేస్తున్నాడు. అంతేగాక ఫిట్‌నెస్, వికెట్ల మధ్య అతడి పరుగు, స్ట్రైక్ రొటేట్ ఎలా చేయాలో కోహ్లిని చూసి యువ ఆటగాళ్లంతా నేర్చుకోవాలి”
”టీ20 క్రికెట్ ప్రభావంతా ప్రస్తుత ప్లేయర్లంతా భారీ హిట్టింగ్ చేయాలనుకుంటారు. కానీ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో హిట్టింగ్ చేయలేరు. మొదట ఒత్తిడిని జయించాలి. కోహ్లి అలానే ఆడాడు. ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది జట్టును గెలిపించాడు” అని గంభీర్ అన్నాడు.
చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత ఆసీస్‌ను భారత్ 199 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషాన్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ డకౌటయ్యారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ (97)తో కలిసి విరాట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆసీస్ బౌలర్లను ఎదుర్కొంటూ స్కోరుబోర్డు ముందుక నడిపించాడు. 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.