కొద్దిమేర అయినా విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించాలనే ఉద్దేశంతో రాజస్థాన్‌లోని కోటా జిల్లా స్థానిక యంత్రాంగం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. స్థానికంగా ఉండే హాస్టళ్లు, అతిథి గృహాల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశించింది. ఐఐటీ, జేఈఈ, నీట్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులు పొరుగు రాష్ట్రాల నుంచి కోటాకు వస్తుంటారు. ఈ ఏడాది అక్కడ దాదాపు 2.5 లక్షల మంది శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. అయితే, గత కొద్ది రోజులుగా ఇక్కడ తరచూ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఏడాదిలో ఇప్పటికే 20 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గత ఎనిమిదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కోటాలో ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం సమావేశం నిర్వహించి విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు పలు నిర్ణయాలు తీసుకుంది. మృతి చెందిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించినట్లు గుర్తించిన అధికారులు.. హాస్టళ్లు, అతిథి గృహాల్లో వాటిని తొలగించి స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. లోడ్‌ను గుర్తించిన క్షణంలోనే అన్‌కాయిల్ అయ్యేలా ఈ ఫ్యాన్లను తయారుచేశారు. ఫ్యాన్‌పై లోడ్ పడితే , ఫ్యాన్ సీలింగ్ నుంచి విడిపోయి కిందకు వేలాడుతుంది. మరోవైపు విద్యార్థుల మానసిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు కచ్చితంగా విద్యార్థులకు వారాంతపు సెలవులు ఇవ్వాలని కోచింగ్ సంస్థలకు అధికారులు ఆదేశించారు.