కోహ్లి 510 కి.మీ పరిగెత్తాడు!!

కింగ్‌ కోహ్లి.. క్రికెట్‌ ప్రపంచం అతడిని రారాజుగా పిలుస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఏ ఆటగాడైనా ఒత్తిడికి లోనవుతుంటాడు. కానీ ఇతడు మాత్రం రెట్టింపు బలంతో ఆడతాడు. అందుకే రికార్డులే అతడి పేరుపై ఉండాలని పోటీపడుతుంటాయి. ఎన్ని పరుగులు చేసినా తీరని దాహం, ఛేదనలో తెగువ, ఫీల్డింగ్‌లో చిరుతలా కదలడం అతడికే సొంతం. ఇక ఫిట్‌నెస్‌లో క్రికెట్‌ ప్రపంచానికి అతడే ఆదర్శం. ఫుట్‌బాల్‌ ప్లేయర్‌కు దీటుగా ఫిట్‌నెస్‌ లెవల్‌ ఉంటుంది. ఎన్నో రికార్డులు సాధించిన కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కోహ్లి గురించి ఇంట్రెస్టింగ్‌ పాయింట్స్‌.

కోహ్లి గత 15 ఏళ్లలో పిచ్‌పై దాదాపు 510 కిలోమీటర్లు పరిగెత్తాడంటే మీరు నమ్మతారా? అవును, ఇది నిజం. అతడు క్రికెట్‌ పిచ్‌పై అన్ని కి.మీలు అవలీలగా పరిగెత్తాశాడు. దానిలో 277 కి.మీ. అతడి స్కోరు కోసం పరిగెత్తితే.. మిగిలిన 233 కి.మీ. క్రీజులో తనతో ఉన్న పార్టనర్‌ కోసం పరిగెత్తాడు.

టీ20 ప్రపంచకప్‌ అంటే కోహ్లి సూపర్‌ఫామ్‌లోకి వచ్చేస్తాడు. 2014, 2016 ప్రపంచకప్‌లో ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఇక ఛేజింగ్‌లో అతడి రికార్డు ప్రత్యేకంగా ఉంటుంది. అతడు ఛేదన చేసిన 10 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌లు టీమిండియా గెలిచింది. దీనిలో కోహ్లి 8 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఈ పొట్టిఫార్మాట్‌ మెగాటోర్నీలో అతడు ఛేదన సగటు 270.5. విజయం సాధించిన మ్యాచ్‌ల్లో అతడి ఛేజింగ్‌ ఏవరేజ్‌ ఏకంగా 518. సగటు రికార్డులో ఏ ఆటగాడు కూడా అతడి సమీపంలోనే లేడు.

ఇక కోహ్లి ఇప్పటివరకు 83 స్టేడియాల్లో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడాడు. దానిలో 46 వేదికల్లో సెంచరీల మోత మోగించాడు. అడిలైడ్‌లో ఏకంగా 5 శతకాలు సాధించాడు. ఇలాంటి ఘనత సచిన్‌ తర్వాత కోహ్లీనే సాధించాడు. సచిన్‌ 53 వేదికల్లో శతక్కొట్టాడు.
ఇక విదేశీ పిచ్‌లపై కోహ్లి చెలరేగిపోతాడు. ఇప్పటి వరకు వన్డేలు ఆడిన తొమ్మిది దేశాల్లో శతకాలు సాధించాడు.

166 vs 73
విరాట్ పేరిట మరో ప్రత్యేక రికార్డు ఉంది. శ్రీలంకతో జరిగిన వన్డేలో కోహ్లీ 166* పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 317 పరుగులు చేయగా లంక 73 పరుగులకే కుప్పకూలింది. కోహ్లీ చేసిన పరుగుల కంటే ప్రత్యర్థి జట్టు 93 పరుగుల వెనుకంజలో ఉంది. ఇలా ప్రత్యర్థి జట్టు స్కోరు కంటే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో జయసూర్య ఉన్నాడు.

బ్యాటింగ్ లోనే కాదు, బౌలింగ్‌లోనూ కోహ్లికి అరుదైన రికార్డు ఉంది. ఏ ఫార్మాట్‌లో అయినా బంతి వేయకుండానే అంగేట్రంలో వికెట్‌ సాధించిన బౌలర్‌గా విరాట్ నిలిచాడు. ఇలాంటి ఘనత ఇప్పటివరకు ఎవరూ సాధించలేదు. 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో కెవిన్‌ పీటర్సన్‌ను వైడ్‌తో స్టంపౌట్‌ చేశాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం