ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహా గణపతికి తొలిపూజ జరిగింది. ఉదయం 11 గంటలకు జరిగిన తొలిపూజలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, హరియాణా గవర్నర్ దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భారీ గణనాథుడు ఈసారి ‘శ్రీ దశమహా విద్యా గణపతి’గా భక్తులకు దర్శనమిస్తున్నాడు.
అయితే గతేడాది 50 అడుగుల ఎత్తులో వెలిసిన ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి 63 అడుగులతో రూపుదిద్దుకున్నాడు. గణేశుడికి ఇరువైపులా వారాహి దేవి, సరస్వతీ దేవి విగ్రహాలు ఉన్నాయి. ఇక ప్రధాన మండపానికి ఇరువైపులా శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలు ఏర్పాటు చేశారు. దాదాపు 150 మంది కళాకారులు 100 రోజులు శ్రమించి ఈ భారీ లంబోదరుడి విగ్రహాన్ని తయారు చేశారు. పర్యావరణహితం కోసం మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. విగ్రహ తయారీకి రూ.90 లక్షలు ఖర్చు అయిందని నిర్వాహకులు తెలిపారు.
తిలక్ ప్రేరణతో, సింగరి శంకరయ్య 1954లో ఖైరతాబాద్‌లోని ఒక అడుగు గణేషుడి విగ్రహాన్ని మొదటిసారిగా స్థాపించారు. అయితే నిర్మించబడిన విగ్రహం ఎత్తు 2014 వరకు ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచుతూ వచ్చారు. 2019 నాటికి విగ్రహం శిఖరం ఎత్తు 61 అడుగులకు చేరింది. ఆ సంవత్సరంలో భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహంగా నిలిచింది. తర్వాత ఏడాది నుంచి మళ్లీ క్రమంగా ఒక్కో అడుగు తగ్గించారు. హుస్సేన్ సాగర్ సరస్సుకు మార్గం పరిమితులు, పర్యావరణ సమస్యల కారణంగా పరిమాణం తగ్గిస్తూ వచ్చామని తెలిపారు. అయితే ఈ సారి ఏకంగా 63 అడుగుల విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేయడం విశేషం.