ఉగ్రవాదుల దాడిలో ఓ సైనికుడిని రక్షించే ప్రయత్నంలో భారత ఆర్మీ (Indian Army)కి చెందిన శునకం ‘కెంట్’ ప్రాణత్యాగం చేసింది. మంగళవారం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఇండియన్ ఆర్మీ బృందం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ‘ఆపరేషన్ సుజలిగల’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఆరేళ్ల కెంట్‌ను కూడా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో కెంట్ ముందుగా పొద దగ్గరకు వెళ్లింది. ఉగ్రవాదులు కనిపించగానే జవాన్లను అప్రమత్తం చేసింది. అయితే ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భారీగా కాల్పుల జరిగాయి. ఈ నేపథ్యంలో ఓ సైనికుడిని ఉగ్రవాదులు చుట్టుముట్టడంతో కెంట్ వారికి ఎదురుగా వెళ్లింది. భారీ కాల్పుల మధ్య ఆ వీర శునకం తీవ్రంగా గాయపడి మరణించింది.
కెంట్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భారత సైన్యం నివాళుల అర్పించింది. ”21వ ఆర్మీ డాగ్ యూనిట్‌లోని లాబ్రడార్ జాతికి చెందిన ఆడ శునకం (కెంట్) తన సైనికుడి ప్రాణాలను రక్షించే క్రమంలో ప్రాణాలను కోల్పోయింది. ఇది ఎంతో బాధాకరం. దేశం కోసం చేసిన గొప్ప త్యాగం” అంటూ ఆర్మీ అధికారులు నివాళుల అర్పించారు. కాగా, కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టగా, ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు, ఓ ప్రత్యేక పోలీసు అధికారికి గాయాలు అయ్యాయి.