బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కి లుంగీతో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. గతంలో ఆయన హీరోగా నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో లుంగీ డాన్స్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే మేజిక్ రిపీట్ చేశాడు కింగ్ ఖాన్. జవాన్ సినిమాలో కూడా లుంగీ కట్టాడు. ఈ సాంగ్ మ్యూజిక్ చార్ట్స్‌లో ప్రపంచవ్యాప్తంగా దుమ్ము దులుపుతోంది. యాదృచ్చికంగానే జరిగినా లుంగీ కట్టుకుని డాన్స్ చేయటం అనేది షారూఖ్‌కి లక్ అనే చెప్పాలి. షారూక్‌ఖాన్ పవర్‌తో పాటు లుంగీ లక్ కూడా తోడైందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కేవలం షారూఖ్ మాత్రమే కాదు.. వెనుక ఉండే వెయ్యి మందికి పైగా బ్యాగ్రౌండ్ డాన్సర్స్ సైతం లుంగీ కట్టుకుని డాన్స్ చేయటం వల్ల పాటకు ఓ ప్రత్యేకమైన లుక్ వచ్చింది.
ఈ పాటకు అనుకోకుండా కలిసి వచ్చిన మరో విషయం ఏంటంటే ఇందులో ప్రియమణి కూడా ఉండటం. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో కూడా ప్రియమణి ఉంది. ఇప్పుడు మరోసారి ఆమె కింగ్ ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ పాటకు 24 గంటల్లోనే 46 మిలియన్ వ్యూస్ రావటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. ఇటు దర్శకుడు అట్లీకి, అటు హీరోయిన్ నయనతారకు ఇదే తొలి బాలీవుడ్ సినిమా. వచ్చేనెల 7న ‘జవాన్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పఠాన్ ను మించిన సక్సెస్ ను ఆశిస్తున్నాడు షారూక్.