చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన చంద్రయాన్-3 ‘రోవర్ ప్రజ్ఞాన్’ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే పరిశోధనల్లో కీలక సమాచారం అందించిన ప్రజ్ఞాన్ నిగూఢ రహస్యాలను శోధిస్తుంది. అయితే ఇస్రో తాజాగా జాబిల్లిపై రోవర్ తిరుగుతున్న వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది. ”సురక్షితమైన మార్గాన్ని వెతుక్కుంటూ రోవర్ తిరుగుతోంది. ప్రజ్ఞాన్ భ్రమణాన్ని ల్యాండర్ ఇమేజర్ కెమెరా బంధించింది. తల్లి ఆప్యాయంగా చూస్తుంటే.. చందమామ పెరట్లో చిన్నారి సరదాగా ఆడుకుంటున్నట్లుగా ఉంది” అంటూ ఇస్రో సరదాగా ట్వీట్ చేసింది.
కాగా, ఆగస్టు 23న చంద్రయాన్-3ను భారత్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దక్షిణ ధ్రువానికి చేరువలోని ఉపరితలంపై మొదటిసారిగా జరిపిన పరిశోధనల్లో సల్ఫర్ ఉనికిని రోవర్‌లోని కీలమైన లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (లిబ్స్) ఇటీవల గుర్తించింది. ఇప్పుడు ప్రజ్ఞాన్‌లోని మరో పరికరం కూడా దీన్ని ధ్రువీకరించింది. మరో టెక్నిక్ ఆల్ఫా పార్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోస్కోప్ (APXS)తో జాబిల్లి ఉపరితలంపై సల్ఫర్ ఉన్నట్లు గుర్తించింది.