గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో పడని నియోజకవర్గం హిందూపురం. పైగా ఈ నియోజకవర్గం పేరు చెబితే టక్కున గుర్తుకు వచ్చే పేరు నందమూరి బాలకృష్ణ. రెండు దఫాలుగా ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో పాగా వేయడానికి వైసీపీ ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఎంత మంది నేతలను తెరమీదకు తెచ్చినా.. లీడర్స్ మధ్య అనైక్యత చేదు ఫలితాలనే ఇచ్చింది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎవరి కుంపటి వారిదే. మొన్నటి వరకు హిందూపురం వైసీపీ ఇంఛార్జ్‌గా ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఉండేవారు. ఆయన మాజీ పోలీస్ అధికారి. పైగా ముస్లిం సామాజికవర్గం కావడంతో హిందూపురంలోని మైనారిటీ ఓట్లు కలిసివస్తాయని లెక్కలేసింది వైసీపీ అధిష్ఠానం. గత ఎన్నికల్లో స్థానికంగా బలంగా ఉన్న వైసీపీ నేత నవీన్ నిశ్చల్‌ను కాదని ఇక్బాల్‌ను బరిలో దించింది. అభ్యర్థిని మార్చినా హిందూపురంలో పార్టీ రాత మారలేదు.
ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఇక్బాల్, నవీన్ వర్గాల మధ్య సీమ ఫ్యాక్షన్ స్థాయిలో వర్గ విభేదాలు బుస కొట్టాయి. ఇద్దరు నాయకుల మధ్య సయోధ్యకు వైసీపీ అధిష్ఠానం అనేక ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదు. ఒకానొక దశలో రెండు వర్గాలు ఎదురుపడితే వైరిపక్షాల మాదిరి ఘర్షణ పడ్డ ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఇటీవల వైసీపీ మాజీ ఇంఛార్జ్ చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య స్థానికంగా ఉన్న విభేదాలను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. రామకృష్ణారెడ్డి సోదరి సైతం పావులు కదపడటంతో రెండు వర్గాలు కాస్తా మూడు వర్గాలు అయ్యాయి. దీంతో ప్రత్యామ్నాయ నేత కోసం అన్వేషించిన అధిష్ఠానం.. హిందూపురంలోని కురబ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని దీపికకు అవకాశం ఇచ్చింది. దీపిక భర్త రెడ్డి సామాజికవర్గం. కురుబ, రెడ్డి సామాజికవర్గాల కలయిక తప్పకుండా వర్కవుట్ అవుతుందన్నది హైకమాండ్ ఆలోచన. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ఇక్బాల్, నవీన్ నిశ్చల్ సైలెంట్ అయ్యారు.
దీపిక రాకతో హిందూపురం వైసీపీ గాడిన పడిందని అనుకున్నా.. ఇప్పుడు కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. . నిన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్, నవీన్ నిశ్చల్‌లు కలిసిపోయారు. రహస్య మంతనాలు చేస్తున్నారు. పాత విభేదాలు పక్కన పెట్టేసి.. దోస్త్ మేరా దోస్త్ అంటున్నారు. వీరి ఆప్యాయ పలకరింపులు కేడర్‌ను ఆశ్చర్యపరుస్తున్నాయి. అసలు కలుస్తారా.. కలిసి పనిచేస్తారా అని అనుకున్న వారికి ఈ సీన్ అర్థం కావడం లేదు. ఈ ఐక్యత ఏదో గత ఎన్నికల్లో చూపిస్తే వైసీపీ పాగా వేసేది కదా అని కొందరి ప్రశ్న. అయితే ఇక్బాల్, నవీన్ నిశ్చల్ కలయిక వెనుక వేరే కథ ఉందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్న ఇంఛార్జ్ దీపికను ఎదుర్కోవడానికే ఇద్దరు కలిశారని టాక్ నడుస్తోంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడిని నిజం చేస్తున్నారు నాయకులు. అంతేకాదు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండబోరన్న దానికి ఇక్బాల్, నవీన్ నిశ్చల్‌ను ఉదాహరణగా చెబుతున్నారు. మరి ఈ పరిణామాలు హిందూపురంలో వైసీపీకి ఏ మేరకు కలిసి వస్తాయో చూడాలి!