IREvIND: భారత్‌దే సిరీస్‌.. మెరిసిన రింకూ, శాంసన్‌

ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. 33 పరుగుల తేడాతో గెలిచి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (58; 43 బంతుల్లో), సంజు శాంసన్‌ (40; 26 బంతుల్లో), రింకూ సింగ్‌ (38; 21 బంతుల్లో) రాణించారు. అనంతరం ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులే చేసింది. ఓపెనర్ బాల్‌బెర్నీ (72; 51 బంతుల్లో) పోరాడాడు.

లక్ష్య ఛేదకు దిగిన ఐర్లాండ్‌ను ప్రసిధ్‌ కృష్ణ (2/29) ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్‌లో స్టిర్లింగ్, టకర్‌ను డకౌట్‌ చేశాడు. కొద్దిసేపటికే హ్యారీ టెక్టార్ (7)ను రవి బిష్ణోయ్‌ (2/37) ఔట్‌ చేయడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. కానీ బాల్‌బెర్నీ మిగిలిన బ్యాటర్ల సాయంతో స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. కానీ భారత బౌలర్లు పుంజుకుని వికెట్లు పడగొట్టడంతో ఐర్లాండ్‌ ఓటమిపాలైంది. చివర్లో అడైర్‌ (23; 15 బంతుల్లో) సిక్సర్లతో మెరిశాడు. ఆఖరి ఓవర్‌ వేసిన బుమ్రా (2/15) మెయిడిన్‌ చేశాడు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. యశస్వి జైశ్వాల్‌ (18;11 బంతుల్లో) దూకుడుగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్‌ ఒక్కపరుగుకే వెనుదిరిగాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శాంసన్‌.. రుతురాజ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. తనదైన శైలిలో శాంసన్‌ చెలరేగి స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. ఆఖర్లో రింకూ సింగ్‌,శివమ్‌ దూబె (22;16 బంతుల్లో) సిక్సర్లతో విజృంభించారు. వీరిద్దరి ధాటికి ఆఖరి రెండు ఓవర్లలో టీమిండియా 42 పరుగులు చేసింది. రింకూకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం