హై వోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ బౌలర్లు బెంబేలెత్తించారు. బుమ్రా, సిరాజ్, హార్దిక్ పేస్ ధాటికి కుల్‌దీప్, జడేజా మాయాజలం తోడవ్వడంతో.. చిరకాల ప్రత్యర్థి పాక్ 191 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే పాక్‌కు మంచి ఆరంభమే దక్కింది. జాగ్రత్తగానే ఆడుతూ మధ్యమధ్యలో బౌండరీలు సాధిస్తూ స్కోరుబోర్డును పాక్ ఓపెనర్లు అబ్దుల్లా షఫికీ (20), ఇమామ్ ఉల్ హక్ (36) నడిపించారు. కానీ షఫికీని సిరాజ్ వికెట్లు ముందు దొరకబుచ్చుకొని తొలి దెబ్బ తీశాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ ఇమామ్‌ను హార్దిక్ పెవిలియన్‌కు చేర్చాడు.
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన బాబర్ అజామ్ (50), మహ్మద్ రిజ్వాన్ (49).. 82 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు కుదురుకోవడంతో పాక్ భారీస్కోరు సాధిస్తుందని భావించారంతా. కానీ సిరాజ్ బాబర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి పాక్ ఆశలకు కళ్లెం వేశాడు. ఆ తర్వాత భారత బౌలర్లు పాక్‌కు అవకాశమే ఇవ్వలేదు. కుల్‌దీప్ ఒకే ఓవర్‌లో రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్‌ను ఔట్ చేసి పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. పాక్ తమ చివరి 7 వికెట్లు 36 పరుగులకే కోల్పోయింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్, హార్దిక్, కుల్‌దీప్, జడేజా తలో రెండు వికెట్లు తీశారు.