హై వోల్టేజ్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనుకుంటే ఏకపక్షంగా సాగింది. చరిత్రను కొనసాగిస్తూ ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించి ప్రపంచకప్ సమరంలో 8-0తో ఆధిపత్యాన్ని కొనసాగించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డేలో ఆల్‌రౌండ్ షోతో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్, శ్రేయస్ అయ్యర్ సమయోచిత అర్ధశతకం సాధించడంతో 192 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 30.3 ఓవర్లలోనే ఛేదించింది. ఆరు పాయింట్లతో టేబుల్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలోనే 191 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా, సిరాజ్, హార్దిక్, కుల్‌దీప్, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. బాబార్ అజామ్ 50 పరుగులు, రిజ్వాన్ 49 పరుగులు చేశారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు ఆది నుంచే ఎదురుదాడికి దిగారు. బౌండరీలతో స్కోరుబోర్డు నడిపించారు. అయితే అఫ్రిది బౌలింగ్‌లో గిల్ షాట్‌కు యత్నించి షాదబ్‌ఖాన్ చేతికి చిక్కాడు. దీంతో 23 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే మరో ఎండ్‌లో రోహిత్ సిక్సర్లతో విరుచుకుపడటంతో మ్యాచ్ ఆద్యంతం మనదే పైచేయిగా నిలిచింది. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లి 16 పరుగులకే వెనుదిరిగినా.. హిట్‌మ్యాన్ పాక్ బౌలర్లపై దాడి కొనసాగించాడు. ఈ క్రమంలో 36 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. అయితే శతకం దిశగా దూసుకెళ్తున్న అతడు అఫ్రిది బౌలింగ్‌లో ఔటయ్యాడు. రోహిత్ 63 బంతుల్లోనే 86 పరుగుల చేశాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (19)తో కలిసి శ్రేయస్ అయ్యర్ (53) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ లాంఛనాన్ని పూర్తిచేశారు. గిల్ 16 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది రెండు వికెట్లు, హసన్ అలీ ఒక్క వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాక్‌కు మంచి ఆరంభమే దక్కింది. జాగ్రత్తగానే ఆడుతూ మధ్యమధ్యలో బౌండరీలు సాధిస్తూ స్కోరుబోర్డును పాక్ ఓపెనర్లు అబ్దుల్లా షఫికీ (20), ఇమామ్ ఉల్ హక్ (36) నడిపించారు. కానీ షఫికీని సిరాజ్ వికెట్లు ముందు దొరకబుచ్చుకొని తొలి దెబ్బ తీశాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ ఇమామ్‌ను హార్దిక్ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన బాబర్ అజామ్ (50), మహ్మద్ రిజ్వాన్ (49).. 82 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు కుదురుకోవడంతో పాక్ భారీస్కోరు సాధిస్తుందని భావించారంతా. కానీ సిరాజ్ బాబర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి పాక్ ఆశలకు కళ్లెం వేశాడు. ఆ తర్వాత భారత బౌలర్లు పాక్‌కు అవకాశమే ఇవ్వలేదు. కుల్‌దీప్ ఒకే ఓవర్‌లో రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్‌ను ఔట్ చేసి పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. పాక్ తమ చివరి 7 వికెట్లు 36 పరుగులకే కోల్పోయింది.