భారత్‌ విజయం.. హార్దిక్‌పై విమర్శలు

India won by 7 wickets but Hardik Pandya getting trolls

సిరీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో భారత్‌ అదరగొట్టింది. మంగళవారం జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-2తో నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 159/5 స్కోరు చేసింది. పావెల్‌ (40, 19 బంతుల్లో) ధాటిగా ఆడాడు. అనంతరం ఛేదనకు దిగిన టీమిండియా 17.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (83; 44 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. తిలక్‌ వర్మ (49*; 37 బంతుల్లో) మరోసారి ఆకట్టుకున్నాడు.

లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు పేలవ ఆరంభం దక్కింది. ఇషాన్‌ స్థానంలో వచ్చిన యశస్వి జైశ్వాల్‌ (1) ఎదుర్కొన్న రెండో బంతికే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ శుభమన్‌ గిల్‌ (6; 11 బంతుల్లో) మరోసారి విఫలమయ్యాడు. దీంతో మరోసారి భారత్‌కు ఓటమి తప్పదని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే సూర్యకుమార్‌ తన లయను అందుకోవడంతో స్కోరు బోర్డు పరుగులుపెట్టింది. మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ బౌండరీలు బాదాడు. అతడికి తోడుగా తిలక్‌ వర్మ సాధికారికంగా ఆడటంతో భారత్‌ విజయం ఖరారైంది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న సూర్య భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన హార్దిక్‌ (20; 15 బంతుల్లో) తిలక్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌కు శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు బ్రాండన్‌ కింగ్‌ (42; 42 బంతుల్లో), మేయర్స్‌ (25; 20 బంతుల్లో) 55 పరుగులు జోడించారు. అయితే భారత్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో స్కోరుబోర్డు నెమ్మదిగా సాగింది. 16 ఓవర్లుకు 113 పరుగులే చేసింది. కానీ ఈ దశలో బ్యాటింగ‌కు వచ్చిన పావెల్‌ దూకుడగా ఆడటంతో విండీస్ 159 పరుగులు చేసింది. అర్షదీప్‌ వేసిన 19 ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి.

హార్దిక్‌పై ట్రోల్స్‌
జట్టును విజయం దిశగా నడిపించిన కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యపై విమర్శలు వస్తున్నాయి. అయితే అది అతడి కెప్టెన్సీపై కాదు. యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మ అర్ధశతకం చేయకుండా అడ్డుకున్నందుకు సోషల్‌మీడియాలో హార్దిక్‌పై ట్రోల్‌ చేస్తున్నారు. విజయానికి మరో రెండు పరుగుల సమయంలో హార్దిక్‌ స్ట్రైక్‌లో ఉండగా మరో ఎండ్‌లో తిలక్‌ 49 పరుగులతో నిలిచాడు. అప్పటికీ మరో 13 బంతులు కూడా ఉన్నాయి. దీంతో హార్దిక్‌ సింగిల్‌ తీసి తిలక్‌కు స్ట్రైకింగ్‌ ఇస్తారని భావించారంతా. కానీ హార్దిక్‌ సిక్సర్‌ బాదడంతో తిలక్‌ హాఫ్‌ సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. దీంతో హార్దిక్ పై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం