India vs England- ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఇంగ్లాండ్‌ అనర్హత?

ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు మరో ఓటమి ఎదురైంది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను టీమిండియా 100 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కఠినమైన పిచ్‌పై మొదట భారత్‌ కష్టంగా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (87) గొప్ప ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. సూర్యకుమార్‌ (49), కేఎల్‌ రాహుల్‌ (39) రాణించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో డేవిడ్‌ విల్లీ మూడు, క్రిస్‌ వోక్స్‌ రెండు, ఆదిల్‌ రషీద్‌ రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థి జట్టును భారత బౌలర్లు బెంబేలెత్తించారు. ఇంగ్లాండ్‌ 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. లివింగ్‌స్టన్‌ (27) టాప్‌ స్కోరర్‌. షమి నాలుగు వికెట్లు, బుమ్రా మూడు, కుల్‌దీప్‌ రెండు వికెట్లతో సత్తాచాటారు.

ఆరు మ్యాచ్‌ల్లో అయిదో ఓటమి చవిచూసిన ఇంగ్లాండ్‌ దాదాపు సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించినట్లే. అయితే వరుస ఓటములతో పాయింట్ల టేబుల్‌లో అట్టడుగునున్న ఆ జట్టుకు మరో షాక్‌ ఎదురుకానుంది. 2025లో జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత కోల్పోయే ప్రమాదంలో పడింది. ఆ టోర్నీకి నేరుగా అర్హత సాధించాలంటే ప్రస్తుత ప్రపంచకప్‌లో టాప్‌-7లో ఉండాలి. అయితే ఇంగ్లాండ్‌.. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌, పాకిస్థాన్‌తో వరుసగా తలపడనుంది. ఈ మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తే టాప్‌-7 లో ఈజీగా దూసుకెళ్తోంది. కానీ వరుస ఓటములతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆ జట్టు ఆసీస్‌, పాక్‌ మ్యాచ్‌ల్లో ఎలా రాణిస్తుందో చూడాలి. గతంలో ఛాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధించాలంటే వన్డే ర్యాంకింగ్స్‌ ఆధారంగా ఎంపిక చేసేవారు. ఈ సారి పాయింట్స్‌ టేబుల్‌ ఆధారంగా చేయనున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం