ఓపెనర్లు లిటన్ దాస్ (66), తన్జిద్ హసన్ (51) అర్ధశతకాలతో రాణించడంతో భారత్‌కు బంగ్లాదేశ్ 257 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ల ఆ జట్టుకు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించారు. తొలుత నిదానంగా ఆడినా, తర్వాత దూకుడు పెంచారు. అయితే కుల్‌దీప్ యాదవ్ ఈ జోడిని విడగొట్టి తొలి దెబ్బ తీశాడు. ఆ తర్వాత భారత బౌలర్లు పుంజుకొని క్రమంగా వికెట్లు తీయడంతో 137 పరుగులకే బంగ్లా నాలుగు వికెట్లు కోల్పోయింది.
అయితే ముష్ఫికర్ (38)తో కలిసి మహ్మదుల్లా (46) జట్టును ఆదుకున్నాడు. మహ్మదుల్లా బౌండరీలు సాధిస్తూ వేగంగా పరుగులు రాబట్టాడు. కానీ ఆఖరి ఓవర్లో సూపర్ యార్కర్‌తో బుమ్రా అతడిని క్లీన్‌బౌల్డ్ చేశాడు. భారత బౌలర్లలో జడేజా, బుమ్రా, సిరాజ్ రెండు వికెట్లు, శార్దూల్, కుల్‌దీప్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. సింగిల్స్‌ను నియంత్రించడంతో పాటు బౌండరీ లైన్‌లో గొప్పగా ఫీల్డింగ్ చేశారు. ఇక జడ్డూ, కేఎల్ రాహుల్ అందుకున్న క్యాచ్‌లు హైలైట్‌గా నిలిచాయి.
హార్దిక్‌కు గాయం
ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్య గాయపడ్డాడు. ఎడమకాలి మడమ గాయంతో బౌలింగ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. తొమ్మిదో ఓవర్ వేసిన హార్దిక్ తొలి మూడు బంతుల అనంతరం నొప్పిని భరించలేక విలవిలలాడాడు. ఆ ఓవర్‌ను విరాట్ కోహ్లి పూర్తి చేశాడు. అయితే హార్దిక్‌ను స్కానింగ్‌కు పంపించామని బీసీసీఐ తెలిపింది. రిపోర్టులు వచ్చిన తర్వాతనే హార్దిక్ గాయం తీవ్రత తెలుస్తుంది. బంగ్లా ఇన్నింగ్స్ ఆరంభంలోనే మైదానాన్ని వీడిన హార్దిక్.. టీమిండియా అయిదో వికెట్ కోల్పోయిన తర్వాతనే బ్యాటింగ్‌కు రావాల్సి ఉంటుంది. లేదా భారత్ ఇన్నింగ్స్ ఆరంభించిన రెండు గంటల ఆట తర్వాత అతడు బ్యాటింగ్‌కు రావొచ్చు.