Jaahnavi Kandula -అమెరికా పోలీస్‌ తీరుపై భారత్ ఫైర్‌

అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతి కేసులో అక్కడి ఓ పోలీసు అధికారి వ్యవహరించిన తీరును భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఉన్నతాధికారులు వెంటనే దర్యాప్తు చేయాలని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం కోరింది. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లింది. ఈ ఏడాది జనవరిలో కళాశాలకు వెళ్లి తిరిగివెళ్తుండగా పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఆమెను ఢీకొట్టింది. జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సియాటిల్‌ నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి జోకులు వేసుకుంటూ నవ్వుతూ మాట్లాడారు, ఆమె మరణానికి విలువలేనట్టుగా వ్యవహరించారు. ఆ మాటలన్నీ తాజాగా వెలుగులోకి వచ్చాయి.

”జాహ్నవి కందుల మృతి కేసు విచారణలో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన కథనాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. సియాటిల్‌ అలాగే వాషింగ్టన్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశాం. అలాగే సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం” అని దౌత్యకార్యాలయం వెల్లడించింది.

అమెరికాలో భారత విద్యార్థిని జాహ్నవి మృతిపై పోలీసులు జోక్లు చేసుకోవడంపై మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ”జాహ్నవి మృతిపై SPDకి చెందిన పోలీసు అధికారి ఆమె ప్రాణాలకు విలువే లేదని చులకనగా మాట్లాడటం దారుణం. అవి పూర్తిగా ఖండించదగిన వ్యాఖ్యలు. అతడి మాటలకు తీవ్ర కలత చెందాను. ఈ ఘటనపై భారతదేశంలోని US రాయబారి అక్కడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం చేయాలి” అని ట్వీట్ చేశారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం