AP: సినిమాల్లో చూసి అలా చేశా: కీర్తన

డయల్ 100కు చేస్తే పోలీసులు వస్తారని సినిమాల్లో చూసి తెలుసుకున్నాని, అందుకే ఆ సమయంలో పోలీసులకు కాల్‌ చేశానని బాలిక కీర్తన తెలిపింది. వంతెన పక్కగా ఉన్న పైప్‌ను పట్టుకుని 13 ఏళ్ల కీర్తన ఇటీవల ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి పాత వంతెన వద్ద ఈ సంఘటన జరిగింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేష్‌.. కీర్తనను, ఆమె తల్లి సుహాసినిని, చెల్లిని గోదావరిలోకి తోసేశాడు. తన తల్లి, చెల్లి గోదావరిలో పడిపోగా కీర్తన పైపును ఒంటిచేత్తో పట్టుకుని పోలీసులకు కాల్‌చేసి ప్రాణాలను కాపాడుకుంది.

అయితే సమయస్ఫూర్తితో ప్రాణాలు దక్కించుకున్న కీర్తన మీడియాతో మాట్లాడింది. తన తల్లిని, చెల్లిని, తనను నమ్మించి సురేష్‌ గోదావరి నదిలోకి నెట్టేశాడని కన్నీరు పెట్టుకుంది. ”షాపింగ్‌కు అని చెప్పి తీసుకెళ్లాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మా అమ్మను గోదావరిలోకి తోసేశాడు. కారులో ఉన్న నా చెల్లి జెస్సీని కూడా నదిలోకి విసిరేశాడు. నేను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకుని నదిలోకి తోసేశాడు. కానీ, ఓ పైపు ఆసరాగా దొరకడంతో దాన్ని పట్టుకున్నా. కాలు పైపులో ఇరుక్కుపోవడంతో ఓ చేత్తో పైప్ పట్టుకుని, రెండో చేత్తో మొబైల్‌ తీసుకుని కాల్ చేశా. ఆ సమయంలో అందరూ నిద్రపోతారని పోలీసులకు కాల్‌ చేశాను, వెంటనే వచ్చారు” అని కీర్తన వివరించింది. కాగా, దారుణానికి ఒడిగట్టిన సురేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం