women
Home » Women’s Reservation Bill – నారీశక్తి వందన్‌తో చరిత్ర ఆరంభం.. మరి ఇన్నేళ్లు ఏం జరిగింది?

Women’s Reservation Bill – నారీశక్తి వందన్‌తో చరిత్ర ఆరంభం.. మరి ఇన్నేళ్లు ఏం జరిగింది?

by admin
0 comment

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ (Nari Shakti Vandan Adhiniyam) బిల్లు మంగళవారం లోక్‌సభ ముందుకొచ్చింది. ఈ బిల్లును కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ ప్రవేశపెట్టారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావడం విశేషం. దాదాపు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తోన్న ఈ బిల్లుకు విపక్షపార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తుండటంతో చట్టరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఉభయసభల ఆమోదం పొందినప్పటికీ 2027 డీలిమిటేషన్‌ ప్రక్రియ తర్వాతే ఈ రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. రొటేషన్‌ ప్రక్రియలో రిజర్వు సీట్ల కేటాయింపు ఉంటుంది. చట్టసభల్లో 15 ఏళ్లపాటు మహిళకు రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి.

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు (Women’s Reservation Bill) కల్పించాలని గత మూడు దశాబ్దాలుగా ప్రయత్నం జరుగుతూనే ఉంది. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ, 1989 మేలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందగా, రాజ్యసభలో ఆమోదం పొందలేదు. తర్వాత అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు 1992, 1993లో రాజ్యాంగ సవరణ 72, 73తో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారు.

తర్వాత 1996లో పార్లమెంట్‌లో మహిళల రిజర్వేషన్‌ కోసం అప్పటి ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 81వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కానీ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో విఫలమైంది. దీంతో గీతా ముఖర్జీ అధ్యక్షతన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇది సిఫార్సు చేశారు. ముఖర్జీ కమిటీ 1996 డిసెంబర్‌లో తమ నివేదికను సమర్పించింది. అయితే, లోక్‌సభ రద్దుతో బిల్లు కూడా రద్దైంది. రెండేళ్ల తర్వాత వాజ్‌పేయీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం 1998లో బిల్లును ప్రవేశపెట్టింది. అప్పుడు కూడా బిల్లుకు మద్దతు లభించలేదు. అనంతరం వాజ్‌పేయీ ప్రభుత్వం 1999, 2002, 2003లోనూ తిరిగి ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు.

అయిదేళ్ల తర్వాత మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2004లో తన సాధారణ కనీస కార్యక్రమంలో మహిళా రిజర్వేషన్‌ అంశాన్ని చేర్చింది. 2008లో రాజ్యసభలో ప్రవేశపెట్టింది. 1996లో గీతా ముఖర్జీ కమిటీ చేసిన ఏడు సిఫార్సులలో అయిదు సిఫార్సులను ఈ బిల్లులో చేర్చారు. తర్వాత ఈ బిల్లును 2008న స్టాండింగ్ కమిటీకి పంపించారు. ఈ కమిటీ తన నివేదికను 2009లో సమర్పించింది. కేంద్ర మంత్రివర్గం నుండి ఆమోద ముద్ర పొందిన ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదించింది. కానీ తర్వాత లోక్‌సభలో ఎప్పుడూ పరిశీలనకు తీసుకోలేదు. చివరికి 2014లో లోక్‌సభ రద్దుతో మరోసారి అదే పరిస్థితి తలెత్తింది.

కాగా, ప్రస్తుతం లోక్‌సభలో 82 మంది, రాజ్యసభలో 31 మంది మహిళా సభ్యులు ఉన్నారు. మొత్తం 543 మందిలో వీరి సంఖ్య 15 శాతం కంటే తక్కువ. రాజ్యసభలో మహిళల సంఖ్య 14.05 శాతం మాత్రమే. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో అయితే మహిళల ప్రాతినిధ్యం పది శాతం కంటే తక్కువగా ఉంది. మహిళా ప్రజా ప్రతినిధుల సంఖ్య సింగిల్ డిజిట్‌లో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపుర్, మేఘాలయ, ఒడిషా, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, పాండిచ్చేరి ఉన్నాయి. బిహార్, హరియాణా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, దిల్లీ అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం 10 నుంచి 12 శాతం మధ్య ఉంది. అయితే చత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links