హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ధాటికి రాష్ట్ర ప్రజలు అతలాకుతలమవుతున్నారు. కొన్ని గ్రామాలు, ప్రాంతాలు జలమయ్యాయి. తాజాగా సిమ్లాలోని ఓ శివాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 9 మంది మరణించారు. శిధిలాల కింద మరో 20 మందికి పైనే ఉన్నట్లు సమాచారం. శ్రావణ సోమవారం నేపథ్యంలో సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయానికి దాదాపు 50 మంది వరకు భక్తులు చేరుకున్నారు.
ఆలయం కూలిన ఘటనపై రాష్ట్ర సీఎం సఖ్వీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలాలను తొలగించి ప్రజలను రక్షించేందుకు స్థానిక యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోందని తెలిపారు. ఘటనాస్థలాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు, కొండల ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలను సూచించారు. 24 గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో 21 మంది మృతి చెందారని సీఎం తెలిపారు. కాగా, ఈ సీజన్‌లో వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల రూ.7,020.28 కోట్ల నష్టం వాటిల్లింది. వర్ష సంబంధిత ఘటనల్లో దాదాపు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.