జింబాబ్వే దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (Heath Streak) మరణించారని నెట్టింట్లో నేడు పెద్దఎత్తున ప్రచారం సాగింది. 49 ఏళ్ల స్ట్రీక్ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారని కొన్ని మీడియాల్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ వదంతులే అన్ని స్వయంగా హీత్ స్ట్రీక్ వెల్లడించాడు. ఇంకా బతికే ఉన్నానని, పూర్తి వివరాలు తెలియకముందే ఇలాంటి వార్తలు రావడం బాధించిందని అన్నాడు. అయితే స్ట్రీక్ తుది శ్వాస విడిచినట్లు తొలుత జింబాబ్వే మాజీ ఆటగాడు హెన్రీ ఒలొంగ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. అయితే, కాసేపటికే తన పొరపాటును సరి చేసుకుంటూ మరొక ట్వీట్ చేశాడు.
కాగా, జింబాబ్వే క్రికెట్‌లో హీత్ స్ట్రీక్ ఎన్నో ఘనతలు సాధించాడు. ఆ దేశం తరఫున టెస్టుల్లో 100 వికెట్లు సాధించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. బౌలర్‌గానే కాకుండా బ్యాట్స్‌మన్‌గానూ జట్టుకు విజయాలు అందించాడు. స్ట్రీక్ తన కెరీర్‌లో 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 216 వికెట్లు, 1990 పరుగులు చేశాడు. వన్డేల్లో 239 వికెట్లు, 2943 పరుగులు చేశాడు.
అరంగేట్ర మ్యాచ్‌లో వికెట్ లేకుండా నిరాశపరిచిన స్ట్రీక్ తర్వాత జరిగిన టెస్టులో ఎనిమిది వికెట్లతో సత్తాచాటాడు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతడు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. జింబాబ్వే, స్కాట్‌ల్యాండ్, బంగ్లాదేశ్ జట్లతో పాటు గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే అవినీతి నిబంధనలు ఉల్లఘించాడనే కారణంతో ఐసీసీ ఆయనపై ఎనిమిదేళ్ల పాటు నిషేధం విధించింది.