ఎంత పెద్ద కష్టం వచ్చినా కొందరు కన్నీరు రానివ్వరు. మనోధైర్యంతో పోరాడుతుంటారు. మరికొంత మంది చిన్న సమస్య వచ్చినా భావోద్వేగాన్ని నియంత్రించుకోలేరు, ఏడ్చేస్తుంటారు. అయితే ఏడ్వడం మంచిది కాదనే తరుచుగా వింటుంటాం. కానీ ఏడుపు కూడా ఆరోగ్యానికి శ్రేయస్సు అని వైద్యులు చెబుతున్నారు.
కొన్ని సందర్భాల్లో ఫీలింగ్స్‌ను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. విపరీతమైన బాధ ఉన్నా అనుచుకోవాల్సిని పరిస్థితి తలెత్తుంది. అయితే ఇలా చేస్తే మానసిక సమస్యలు తప్పవు. పని భారం, వ్యక్తిగత విషయాలు, ఇతర కారణాలతో మనలో ఒత్తిడి పెరుగుతుంటుంది. అలాంటి సమయంలో భావోద్వేగాన్ని నియంత్రించుకుంటే మన మెదడుపై ఇంకా భారం పడుతుంది. మానసికంగా బలహీనులవుతాం.
ఏడ్చిన సమయంలో ఒత్తిడి హార్మోన్లు, టాక్సిన్లు విడుదలు అవుతాయి. ఇవి మానసికంగా ఉపశమనాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఆక్సీటోసిన్ విడుదలవుతుంది. దీనిని హ్యాపీ హార్మోన్ అంటుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కన్నీరు కార్చేటప్పుడు ఎండార్ఫిన్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఇది శరీర నొప్పి నివారణకు, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆందోళనను కూడా తగ్గిస్తుంది.
అంతేగాక మెదడులోని నాడీ కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది. మానసికంగా కాస్త ఊరట కలిగిస్తుంది. కన్నీరుతో కళ్లకు కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బాక్టీరియా, వైరస్ ను తొలగించే పదార్థాలు కన్నీటిలో ఉంటాయి. ఇవి నేత్రాలను శుభ్రం చేస్తాయి.సన్నిహిత వ్యక్తులతో బాధను పంచుకుంటే మానసికంగా ఎంతో మేలు ఉంటుంది.
ఏడిస్తే ఇన్నిప్రయోజనాలు ఉండటంతో కొన్ని దేశాల్లో క్రైయింగ్ కోసం కొన్ని రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. స్పెయిన్ సైకియాట్రిస్టులు ఏర్పాటు చేసిన క్రైయింగ్ రూమ్‌కు మంచి స్పందన వచ్చింది. బాధను ఎప్పటికప్పుడు కన్నీటి రూపంలో వెళ్లగక్కడంతో ఆరోగ్యానికి మేలుతో పాటు ఆత్మహత్యల సంఖ్య కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. బాధను పంచుకోవడం కోసం ఇప్పటికే టెలీకాల్స్ స్టార్టప్స్ కూడా వచ్చాయి. మన బాధను విని, ఓదార్చి ఫీజును తీసుకుంటారు.