హర్యానాలోని భివానీ జిల్లాకు చెందిన ముర్రాజాతి గేదె ‘ధర్మా’ అందాల పోటీల్లో సత్తాచాటుతుంది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించే గేదెల అందాలపోటీల్లో విజేతగా నిలుస్తూ విలువైన బహుమతులు సొంతం చేసుకుంటుంది. హర్యానాలో ఎంతో ఫేమస్ అయిన ‘ధర్మా’ రోజుకు 15 లీటర్ల పాలు కూడా ఇస్తుంది. ప్రస్తుతం నెట్టింట్లో ధర్మా గురించి వైరల్ అవుతోంది. అందాల పోటీలోనూ, పాలలోనూ ఔరా అనిపిస్తున్న ధర్మాను కొనియాడుతూ కామెంట్లు చేస్తున్నారు.
యజమాని సంజయ్ ఈ ఫేమస్ గేదెకు ‘ధర్మా’ అని పేరు పెట్టాడు. మూడేళ్ల వయసున్న ధర్మాకు ఓ దూడ కూడా ఉంది. అయితే ‘ధర్మా’తో లాభాలు వస్తున్నప్పటికీ ఖర్చు కూడా ఎక్కువగానే ఉందని సంజయ్ చెబుతున్నాడు. పచ్చిగడ్డి, పలురకాల గింజలు, 40కేజీల క్యారెట్లను రోజూ ఆహారంగా అందిస్తామని తెలిపాడు. ‘ధర్మా’ ధర రూ.61 లక్షలు ఉంటుందని చెప్పాడు. కాగా, ముర్రాజాతి గేదెల పాలలో విలువైన పోషకాలు, ప్రోటీన్లు ఉంటాయి. భారత్లో కాకుండా విదేశాల్లోనూ వీటికి మంచి ఆదరణ ఉంది.