తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ”ప్రవళికది ఆత్మహత్య కాదు.. హత్యే. తెలంగాణ యువత నిరుద్యోగంతో విలవిలలాడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే జాబ్ క్యాలెండర్ వస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక యూపీఎస్సీ తరహాలోనే టీఎస్‌పీఎస్సీని బలోపేతం చేస్తాం. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం’’ అని ట్విటర్‌లో రాహుల్ పేర్కొన్నారు.
మరోవైపు గవర్నర్ తమిళసై.. ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి ఆదేశించారు. కాగా, శుక్రవారం రాత్రి అశోక్ నగర్ హాస్టల్ లో ప్రవళిక ఆహత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక (23) అశోక్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్-2 పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పరీక్ష వాయిదా పడడం వల్లే మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని అభ్యర్థులు ఆందోళన చేశారు. ప్రవళిక స్వగ్రామానికి మృతదేహాన్ని ఇవాళ తరలించారు. ప్రవళిక మృతితో బిక్కాజిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.