తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. వేసవి, పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ప్రత్యేక రైళ్లను అక్టోబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో హైదరాబాద్- కటక్, తిరుపతి-జల్నా, జల్నా- చాప్రా, హైదరాబాద్- గోరక్‌పూర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 1 తేదీల మధ్య నిర్దేశించిన తేదీల్లో ఆయా రైళ్లు నడుస్తాయి.
కాగా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 4 రైల్వేస్టేషన్లలో ‘ఎకానమీ మీల్స్’ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, రేణిగుంట రైల్వే స్టేషన్లలో జనరల్ బోగీలో ప్రయాణించే వారి కోసం తక్కువ ధరకే నాణ్యమైన భోజనం, మంచినీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ బోగీలు ఆగేచోట ఈ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. రూ.20కి ఎకానమీ భోజనం, రూ.50కి కాంబో భోజనం లభిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది.