అనుమానంతో భార్యను ఓ భర్త హతమార్చాలనుకున్నాడు. ఆ సమయానికి ఆమె అక్కడ నుంచి తప్పించుకోవడంతో 4 ఏళ్ల కుమారుడిని హతమార్చాడు. పురుగు మందు తాగించి ఈ ఘూతుకానికి పాల్పడ్డాడు. అనంతరం అతడు కూడా అదే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా దేవనకొండలో గురువారం ఈ దారుణం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బనగానపల్లి మండలం పెద్దరాజుపల్లి గ్రామానికి చెందిన అరసాని రాజు (44), అనిత 14ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. దంపతులిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అయిదేళ్ల క్రితం నుంచే దూరంగా ఉంటున్నారు. అనిత ఇద్దరు పిల్లలను తీసుకుని దేవనకొండలోని తన తల్లి దగ్గరకు వచ్చేశారు. ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
అయితే గురువారం ఉదయం హఠాత్తుగా ఓ చేత్తో వేటకొడవలి, మరో చేత్తో పురుగుమందు డబ్బా పట్టుకుని రాజు ఆవేశంతో దేవనకొండకు వచ్చాడు. అతడిని చూసిన అనిత, పెద్ద కుమారుడు దూరంగా వెళ్లిపోయి తప్పించుకున్నారు. తీవ్ర ఉద్రేకంతో ఇంట్లోకి వెళ్లిన రాజు.. నిద్రిస్తున్న చిన్న కుమారుడు ఉజ్వల్‌కు బలవంతంగా పరుగు మందు తాగించాడు. అనంతరం తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అరుస్తూ పురుగు మందు తాగి కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని, చిన్నారిని ఆస్పుత్రికి తీసుకెళ్లినప్పటికీ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.