దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫివరే. అందరూ భారత్-పాక్ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ఫీవర్ అహ్మదాబాద్‌ను కమ్మేసింది. ఈ పోరును వీక్షించడానికి అభిమానులు ఎంతో ఉత్సాహంతో తరలివస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ బసకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో..కొందరు అభిమానులు అహ్మదాబాద్ ఆసుపత్రుల్లో మకాం పెడుతున్నారు. హోటల్ గదులన్నీ ఇప్పటికే దాదాపు కిక్కిరిసిపోవడం, సాధారణ ధరలకన్నా 20 రెట్లు పెరగడంతో.. ఆసుపత్రుల్లో ఆరోగ్య పరీక్షల ప్యాకేజీలు తీసుకుని బెడ్‌లు బుక్ చేసుకుంటున్నారు. మ్యాచ్ సమయానికి వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు మ్యాచ్ ఎఫెక్ట్ తో ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ భవనాలు కూడా లాడ్జీల్లా మారిపోయాయి. యూనివర్సిటీ హాస్టళ్లు అతిథులతో కిటకిటలాడుతున్నాయట.
మరోవైపు క్రికెట్ ఫ్యాన్స్‌కు హోరాహోరీ మ్యాచ్ తో పాటు ఎక్స్‌ట్రా బోనస్ లభిస్తుంది. ఈ మహా సంగ్రామానికి బీసీసీఐ అదిరేలా ఏర్పాట్లు చేస్తుంది. ఆరంభ వేడుకలు లేకుండానే ప్రపంచకప్ మొదలుపెట్టిన బీసీసీఐ ఈ మ్యాచ్‌కు స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఫేమస్ సింగర్స్ అర్జిత్ సింగ్, శంకర్ మహదేవన్, సుఖ్విందర్ సింగ్ ప్రదర్శన ఉండబోతుంది. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకే ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. మరోవైపు ఈ కార్యక్రమానికి హోం మంత్రి అమిత్ షా, సచిన్ తెందుల్కర్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ అతిథులుగా రానున్నారు.