8Kgల మటన్‌ తింటుంటే ఇంకేం గెలుస్తాం- వసీమ్‌ అక్రమ్‌

పాకిస్థాన్‌… వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 2 జట్టు. అంతేగాక ఆ జట్టును నడిపించే నాయకుడు బాబర్‌ అజామ్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌. ఇక ప్రపంచలో పటిష్ట బౌలింగ్‌ దళంగా ఉన్న జట్టుగా పాక్‌ పేరు పొందింది. అయితే సీన్‌ కట్‌ చేస్తే.. నిన్న అఫ్గానిస్థాన్‌ చేతిలో పాకిస్థాన్‌ చిత్తుగా ఓడింది. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం అఫ్గానిస్థాన్‌దే. అదృష్టంగానో, గాలివాటంగానో అఫ్గాన్‌ గెలవలేదు. ఏ దశలో పాక్‌కు అవకాశమివ్వకుండా అదరగొట్టింది. ఈ నేపథ్యంలో పాక్‌ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

చెపాక్‌ పిచ్‌పై 282 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేపోయిన వారి దుస్థితిపై.. కొందరు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తే, మరికొందరు దారుణంగా విమర్శించారు. ఆ దేశ మాజీ ప్లేయర్‌ వసీమ్‌ అక్రమ్‌ అయితే ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ధ్వజమెత్తారు. ”సిగ్గుగా ఉంది. 283 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి కూడా రెండే వికెట్లు పడగొట్టాం. పిచ్‌ బ్యాటింగ్‌కు అంతగా ఫేవరేట్‌గా కూడా లేదు. ఫీల్డింగ్ చెత్తగా ఉంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ లెవల్ దారుణంగా ఉంది. గతంలో దీనిపై ఎన్నోసార్లు చర్చించాం. గత రెండేళ్ల నుంచి ఫిట్‌నెస్ పరీక్షే నిర్వహించలేదు. ఆటగాళ్ల పేర్లు బయటికి చెబితే వారికి నచ్చదు. రోజూ ఎనిమిది కేజీల మటన్‌ తినేసేలా వారు ఉంటున్నారు”

”దేశానికి ప్రాతినిథ్యం వహించే వారికి ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహించాలి. మిస్బా ఉల్ హక్‌ కోచ్‌గా ఉన్న సమయంలో అతడు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపించాడు. కానీ ప్లేయర్లకు అతడి వైఖరి నచ్చలేదు. మిస్బా ఆలోచన జట్టుకు ఎంతో ఉపయోగపడేది. ఫీల్డింగ్‌ ఫిట్‌నెస్‌పైనే ఆధారపడి ఉంటుంది. చివరికి ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే.. సెమీఫైనల్స్‌కు వెళ్లాలంటే ఇతర జట్లు ఓడిపోవాలని కోరుకునే దుస్థితికి వచ్చాం” అని వసీమ్‌ అక్రమ్‌ అన్నాడు. పాకిస్థాన్‌కు పేలవ ఫీల్డింగ్ సమస్య ఇప్పటిది కాదు. తరాల నుంచి వాళ్లను వేధిస్తున్న సమస్య ఇది. సులువైన క్యాచ్‌లతో పాటు రన్స్‌ లీక్‌ చేయడంలో ఆ జట్టు పేలవ రికార్డు ఉంది. కాగా, పాక్‌పై అఫ్గాన్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం