స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని స్లెడ్జింగ్ చేయొద్దని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ ఎన్తిని తమ దేశ బౌలర్లకు సూచించాడు. పొరపాటునా కోహ్లిని రెచ్చడొడితే, భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. రేపటి నుంచి ఆసియాకప్, కొన్ని రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్తిని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
”కోహ్లి గురించి బౌలర్లకు ఒక విషయాన్ని చెప్పాలి. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎవరూ స్లెడ్జింగ్ చేయిద్దు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండాలి. పొరపాటునా అతడిని రెచ్చగొడితే ఘోర పరాభవం తప్పదు. పోటీతత్వాన్ని అతడు బాగా ఆస్వాదిస్తాడు. స్లెడ్జింగ్ చేస్తే అతడికి కావాల్సింది దక్కినట్లుగా ఉత్సాహంతో ఆడతాడు. అదే సైలెంట్‌గా ఉంటే అతడు విసుగుగా భావించి పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అతడిని ఔట్ చేసే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అందుకే విరాట్‌కు స్మార్ట్‌గా బౌలింగ్ చేయాలి” అని ఎన్తిని అన్నాడు. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాక్ సెమీస్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు.
కాగా, కోహ్లి ఆసియాకప్‌కు సన్నద్ధమవుతున్నాడు. రేపటి నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌తో భారత్ ఆదివారం తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విరాట్ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.