దాదాపు 100 ఏళ్ల తర్వాత తమిళనాడులో ఓ మరియమ్మన్ ఆలయంలోకి దళితులు బుధవారం ప్రవేశించారు. పోలీసు పటిష్ట బందోబస్తు మధ్య గుడిలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. తిరువన్నమలై జిల్లాలోని చెల్లానుకుప్పం గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఎన్నో ఏళ్ల నుంచి ఆ గ్రామంలో మరియమ్మన్ ఆలయంలో దళితులకు ప్రవేశం లేదు. అయితే గత నెలలో ఇద్దరి యువకుల మధ్య జరిగిన ఓ ఘర్షణ దళితుల ఆలయ ప్రవేశానికి దారితీసింది. దళిత, వన్నియార్ వర్గాలకు చెందిన ఇద్దరు యువకులు ఒకే పాఠశాలలో చదివారు. అనంతరం ఉద్యోగాల కోసం చెన్నైకి వెళ్లారు. అయితే జులైలో.. ఆలయంలో దళితుల ప్రవేశించే హక్కుపై ఇద్దరి మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా వాగ్వాదం జరిగింది. తర్వాత గ్రామంలో కలుసుకున్నప్పుడు ఇద్దరూ గొడవకు దిగారు.
అనంతరం ఆలయ ప్రవేశానికి అనుమతించాలంటూ దళితులు రెవెన్యూ, పోలీసు అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. దీనిపై స్పందించిన డీఐజీ గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి దళితులను ఆలయ ప్రవేశం చేయించారు. గుడిలోకి అనుమతిచ్చినందుకు దళిత గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
”కొత్తగా పెళ్లైన జంట మరియమ్మన్ గుడిలో పూజలు చేసి, పొంగల్ వండుకునే ఆచారం ఉంది. అలా చేస్తే కోరికలు నెరవేరతాయని బలమైన నమ్మకం. కానీ ఇన్ని రోజులు మమ్మల్ని ఆలయంలోకి అనుమతించలేదు. ఇప్పుడు మేం వెళ్లి పూజలు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది” అని ఆ గ్రామ దళిత మహిళ పేర్కొంది.