స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు చుక్కెదురైంది. సుదీర్ఘ వాదనల అనంతరం హౌస్ రిమాండ్ పిటిషన్ (House Custody Plea)ను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, జైల్లో పూర్తి స్థాయి భద్రత కల్పించామని అదనపు ఏజీ న్యాయస్థానానికి తెలిపారు. జైల్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోనూ పోలీసు భద్రత ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 24 గంటలూ పోలీసులు విధుల్లోనే ఉంటున్నారని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఆర్థిక నేరాల్లో సాక్ష్యాలను ప్రభావం చేసే అవకాశం ఉండటం వల్ల.. చంద్రబాబును హౌస్ రిమాండ్‌కు అనుమతించవద్దని న్యాయస్థానాన్ని కోరారు.
మరోవైపు చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఆయనకు జైలులో ప్రమాదం పొంచి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుకు ముప్పు ఉన్న నేపథ్యంలోనే ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించారని తెలిపారు. కేంద్రం కల్పించిన సెక్యూరిటీకి సంబంధించిన అంశంపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదని కోర్టుకు విన్నవించారు. అనంతరం ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు ఆరోగ్యంపై చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రతి రోజూ ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేలా ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.