జనగామ బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ, భువనగిరిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడారు. జనగామ జిల్లాలో మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నందున భవిష్యత్‌లో ఐటీ, పారిశ్రామికంగా జనగామ అభివృద్ధికి విస్త్రృత అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే దారినపడ్డారని, రైతన్నలకు భూమిపై పూర్తి హక్కులు ఉండాలని ధరణి తెచ్చామని అన్నారు. రెవెన్యూ అధికారుల అధికారాలను రైతు చేతిలో పెట్టామని, ఇప్పుడు విపక్షాలు రైతుల మీద అధికారులను మళ్లీ రుద్దాలని చూస్తున్నాయని విమర్శించారు. ధరణి పోర్టల్‌ను తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని, వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. ఆ పార్టీనే బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్ అన్నారు. ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దని, మంచి, చెడు గుర్తించి ప్రజలు ఓటేయాలని తెలిపారు.