ఐఫోన్ 15 సిరీస్‌లో భాగంగా యాపిల్ కంపెనీ విడుదల చేసిన కొత్తఫోన్లలో సమస్యలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఫోన్ హీటింగ్ సమస్య వస్తుందని టెక్ ప్రియులు ఫిర్యాదు చేస్తున్నారు. గేమ్స్ ఆడే సమయంలో, వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, వీడియోలు చేస్తున్నప్పుడు ఫోన్ బ్యాక్‌సైడ్ వేడెక్కుతోందని అంటున్నారు. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ ఐఫోన్ సిరీస్‌లో నాలుగు వేరియంట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 22 నుంచి వాటి అమ్మకాలు ప్రారంభమవ్వగా వీటిని కొనడానికి విపరీతంగా పోటీపడ్డారు. దీంతో ఏకంగా సేల్స్ పరంగానూ రికార్డులు బద్దలయ్యాయి. ఐఫోన్ 14 సిరీస్ తొలిరోజు విక్రయాలతో పోలిస్తే మొదటిరోజే 100 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయితే అలాంటి ఐఫోన్లోనూ సమస్యలు రావడంతో టెక్ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు.
ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లపై వస్తున్న ఫిర్యాదులపై యాపిల్ కంపెనీ స్పందించింది. కొత్తగా విడుదల చేసిన ఐఓఎస్ 17 ఓఎస్‌లోని బగ్ కారణంగానే ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ వేడెక్కుతున్నాయని స్పష్టం చేసింది. బగ్ కారణంగా బ్యాగ్రౌండ్ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతోందని, దీంతో సమస్య వస్తుందని చెప్పింది. దాంతోపాటు థర్డ్-పార్టీ యాప్‌ల నుంచి వచ్చే అప్డేట్లు కూడా ఫోన్ వేడెక్కేందుకు కారణమవుతున్నాయని తెలిపింది. దీన్ని పరిష్కరించేందుకు యాప్ డెవలపర్లతో కనిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని, కొత్త ఐఓఎస్ 17 అప్డేట్ను విడుదల చేస్తామని వెల్లడించింది. ఫోన్ వేడెక్కడానికి టైటానియమ్ ఫ్రేమ్ కారణం కాదని, డిజైనింగ్‌లో ఎలాంటి సమస్యలేదని తెలిపింది.