రాష్ట్రానికి వరుసగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. పెంపుడు జంతువులు తినే ఆహార ఉత్పత్తుల సంస్థ ‘మార్స్ గ్రూప్’ తెలంగాణలో మరో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోకాకోలా సంస్థ కూడా అదనపు పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు వివరించింది. సిద్దిపేట బాటిలింగ్ ప్లాంట్‌కు మరో రూ.647 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్లాంట్ డిసెంబర్ 24లోగా పూర్తి అవుతుందని తెలిపింది. దీంతోపాటు మరో నూతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కరీంనగర్ లేదా వరంగల్‌లో ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్ మేక్ గ్రివి సమావేశమై వివరాలు వెల్లడించారు.
‘మార్స్ గ్రూప్’ తెలంగాణలో మరో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్‌తో శుక్రవారం మార్స్ సంస్థ చీఫ్ డేటా అండ్ అనలిటిక్స్ ఆఫీసర్ శేఖర్ కృష్ణమూర్తి బృందం సమావేశమై ఈ వివరాలు వెల్లడించింది. పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి, సుస్థిరత వంటి విభాగాల్లో విస్తరణకు అవకాశాలనూ అందిపుచ్చుకుంటామని మార్స్ సంస్థ తెలిపింది.