ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా 2 భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ స్వయంగా ప్రకటించాడు. దీంతో ఎన్టీఆర్ చేయబోయే ఇతర సినిమాలపై అనుమానాలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ చేయబోయే సినిమాపై డౌట్స్ ఎక్కువయ్యాయి. దీంతో మేకర్స్ రంగంలోకి దిగారు. కీలక ప్రకటన చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని అభిమానాన్ని, క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో ఎన్టీఆర్. ఆయన హీరోగా, కె.జి.యఫ్, కె.జి.యఫ్ 2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌ను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ బడ్జెట్ చిత్రం, ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఎంతో ప్రెస్టీజియస్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాయి. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలుంటాయో అందరికీ తెలిసిందే. ఈ అంచనాలకు దీటుగా మేకర్స్ మూవీని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సిద్ధం చేస్తున్నారు. అందరూ ఆశ్చర్యపోయేలా భారీ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించే ఈ డైరెక్టర్ మరోసారి ఎన్టీఆర్‌తో అందరినీ మెప్పించేలా యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించబోతున్నాడు.
కొరటాల దర్శకత్వంలో చేస్తున్న దేవర సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అలా థియేటర్లలోకి వచ్చిన వెంటనే, ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుంది. ఉన్నఫలంగా ప్రశాంత్ నీల్ సినిమాపై ప్రకటన చేయడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. దేవర పార్ట్-1 పూర్తయిన తర్వాత, దేవర పార్ట్-2 షూటింగ్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొంటాడనే ప్రచారం జరిగింది. కానీ అలా జరగడం లేదు. ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తిచేసిన తర్వాత దేవర పార్ట్-2 మొదలుపెడతాడు ఎన్టీఆర్.