జాబిల్లిపై చంద్రయాన్-3 (Chandrayaan-3) ల్యాండింగ్ అయిన ప్రదేశానికి ‘శివశక్తి’గా పేరు పెట్టనున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. విదేశీ పర్యటనలను ముగించుకున్న మోడీ నేరుగా శనివారం బెంగుళూరుకు చేరుకున్నారు. అనంతరం ఆయన చంద్రయాన్-3 విజయం గురించి ప్రసంగించారు. ‘జై విజ్ఞాన్.. జై అనుసంధాన్’ అని నినాదం ఇస్తూ.. అసాధారణ విజయం సాధించామని ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.
భారత వ్యోమనౌక సాఫ్ట్‌ల్యాండింగ్ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నా మనసంతా చంద్రయాన్-3పైనే ఉందని మోదీ తెలిపారు. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించామని, మన సత్తా ప్రపంచానికి చాటి చెప్పామని పేర్కొన్నారు. చంద్రయాన్-3 అడుగుపెట్టిన ప్రాంతానికి ‘శివశక్తి’గా, అలాగే చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ ప్రదేశానికి ‘తిరంగా పాయింట్’గా పేర్లు పెట్టుకుందామని వెల్లడించారు. మేకిన్ ఇండియా జాబిల్లి వరకు చేరిందని అన్నారు. చరిత్ర సృష్టించిన రోజు అయిన ‘ఆగస్టు 23’వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుందామని పిలుపునిచ్చారు.
విజయాల స్ఫూర్తిని కొనసాగించాలని, వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్లో ఈ విజ్ఞానం ఉపయోగపడాలని మోదీ అన్నారు. చంద్రయాన్-3 కృషిలో మహిళా శాస్త్రవేత్తలు ఉండటం గర్వకారణంగా ఉందని, మన నారీశక్తి ఏమిటో ప్రపంచానికి మరోసారి చాటామని వెల్లడించారు. వైఫల్యంతో వెనకడుగు వేయలేదని, పట్టుదలతో పనిచేసి విజయం సాధించామని అన్నారు. ప్రతి ఇంటిపైనే కాదు, చంద్రుడిపైనా త్రివర్ణ పతాకం ఎగురుతోందని తెలిపారు. చందమామ దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.