చరిత్ర సృష్టించడానికి చంద్రయాన్-3 (Chandrayaan-3) అతి చేరువలో నిలిచింది. జాబిల్లిపై దక్షిణ ధ్రువానికి చేరుకోవడానికి వ్యౌమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని మరోసారి ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. కాగా, ఇది రెండో చివరి కక్ష్య. ఈ విన్యాసంతో వ్యౌమనౌక కక్ష్యను 150 కి.మీ x 177 కి.మీలకు తగ్గించినట్లు ఇస్రో సోమవారం తెలిపింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ ‘ నుంచి ఈ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించింది.
తదుపరి కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఆగస్టు 16న ఉదయం 8.30కు చేపట్టనున్నట్లు ఇస్రో పేర్కొంది. దీంతో చంద్రయాన్-3 జాబిల్లిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరనుంది. ఆ తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోతుంది. ఇదంతా సజావుగా సాగితే ఈ నెల 23 సాయంత్రం ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. కాగా, జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 ప్రయోగించిన సంగతి తెలిసిందే.