భారత్ అఖండ విజయం సాధించింది. అంతరిక్ష రంగంలో అగ్రరాజ్యాలకే సాధ్యం కానీ కీర్తిని సాధించింది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా ఘనత సాధించింది. జయహొ భారత్. నాలుగేళ్ల క్రితం చెదిరిన కలను తిరిగి సాధించేందుకు చంద్రయాన్-3ను ఇస్రో ప్రయోగించింది. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలు మోస్తూ జులై 14న భారత వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. నిర్దేశ లక్ష్యాలను ఛేదిస్తూ బుధవారం దిగ్విజయాన్ని అందుకుంది.
చంద్రయాన్-3 సాగిందిలా
జులై 14 – శ్రీహరికోట నుంచి మొదలైన ప్రయాణం. తర్వాత శాస్త్రవేత్తలు దశలవారీగా దానికి కక్ష్య పెంపు విన్యాసాలు చేపట్టారు.
ఆగస్టు 1 – చంద్రుడి కక్ష్య వైపుగా పయనం
ఆగస్టు 5 – జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశం
ఆగస్టు 6, 9, 14, 16 – కక్ష్య తగ్గింపు విన్యాసాలు
ఆగస్టు 17 – ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన ల్యాండర్
ఆగస్టు 18 – వేగం తగ్గింపు తొలి ప్రక్రియ
ఆగస్టు 20 – వేగం తగ్గింపు రెండో ప్రక్రియ
ఆగస్టు 23 – సాఫ్ట్ ల్యాండింగ్ విజయం