హీరో విశాల్ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తన సినిమా ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్‌కు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు.. అధికారులు రూ.6.5 లక్షల లంచం తీసుకున్నారంటూ గురువారం ట్విటర్‌లో విశాల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ట్విటర్ వేదికగా బదులిచ్చింది. ”సెన్సార్ కార్యాలయంలో అవినీతి జరిగినట్టు వార్తలు రావడం దురదృష్టకరం. అవినీతిని ప్రభుత్వం ఏమాత్రం సహించదు. ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడినట్టు తెలితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ విషయంపై నేడు విచారణ జరపనున్నారు” అని ట్వీట్ చేసింది.
ముంబయిలోని సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఆఫీసులో తనకు ఈ చేదు అనుభవం ఎదురైందని, దీన్ని జీర్జించుకోలేకపోతున్నాని తన ఆవేదనను హీరో విశాల్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. తన సినిమా స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, సర్టిఫికేట్ కోసం రూ. 3.5 లక్షలు చెల్లించానని చెప్పాడు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాని పేర్కొన్నాడు. తనకు ఎదురైన ఈ సంఘటన ఇతర నిర్మాతలకు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని తెలిపాడు.