Birth certificate- ఇక అన్నిసేవలకు బర్త్‌సర్టిఫికెట్‌ ఒక్కటి చాలు..

కేంద్రప్రభుత్వం జనన మరణాల నమోదు చట్టాన్ని (Registration of Births and Deaths Act) సవరించింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. గత నెల జరిగిన వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొందగా, ఆగస్టు 11వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో ఇది చట్టంగా మారింది. దీంతో ఇకపై ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ దరఖాస్తుకు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు, పాస్‌పోర్ట్‌, వివాహాల నమోదుకు బర్త్ సర్టిఫికెట్‌ (Birth certificate) ఒక్కటి ఉంటే సరిపోతుంది. అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ, లేదా ఆ తర్వాత జన్మించిన వారికి మాత్రమే బర్త్‌సర్టిఫికెట్‌ను సింగిల్‌ డాక్యుమెంట్‌గా వినియోగించుకోవడానికి వీలుంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక ప్రభుత్వాల ఉద్యోగ నియామకాలకూ సింగిల్‌ డాక్యుమెంట్‌గా వినియోగించుకోవచ్చు.

దీని వల్ల దత్తత తీసుకున్న, అనాథ, తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులు, సరోగేట్‌ పిల్లల నమోదు ప్రక్రియను ఈ చట్టం సులభతరం చేస్తుందని కేంద్రం తెలిపింది. జనన, మరణాలకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో డేటా బేస్‌ ఏర్పాటు చేసుకోవడానికి వీలు పడుతుందని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ సేవలు, సామాజిక పథకాలు, డిజిటల్‌ రిజిస్ట్రేషన్ల విషయంలో పారదర్శకతకు వీలు పడుతుందని తెలిపింది. ఈ చట్టం ద్వారా అన్ని వైద్య సంస్థలూ మరణ ధ్రువీకరణ పత్రంలో మరణానికి గల కారణం రిజిస్ట్రార్‌ తెలియజేయడం తప్పనిసరి చేసింది. సమీప బంధువుకు ఒక కాపీని అందించాలని సూచిస్తోంది.

జనన మరణాల నమోదు 1969 చట్టానికి సవరణ కోరుతూ ఈ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మూజువాణి ఓటుతో ఆగస్టు 1న లోక్​సభ ఆమోదించగా, ఆగస్టు 7న రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం జనన మరణాలు నమోదిత డేటాబేస్​ను నిర్వహించడానికి రిజస్ట్రార్​ జనరల్ ఆఫ్​ ఇండియాకు అధికారం కల్పిస్తుంది. రాష్ట్ర స్థాయిలో చీఫ్​ రిజస్ట్రార్ ఇలాంటి డేటాబేస్​ను నిర్వహిస్తారు. చీఫ్ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రార్లు (స్థానిక ప్రాంత అధికార పరిధి కోసం రాష్ట్రాలు నియమించే అధికారులు) రాష్ట్ర స్థాయిలో జనన మరణ సమాచారాన్ని జాతీయ డేటాబేస్​తో పంచుకోవడానికి బాధ్యత వహిస్తారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం