కేంద్రం మరో వివాదాస్పద బిల్లును తెరపైకి తీసుకువచ్చింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ నియామాకాల ఎంపిక కమిటీల్లో భారత ప్రధాన న్యాయమూర్తి జోక్యాన్ని తొలగించేలా బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సీజేఐ స్థానంలో కేంద్రమంత్రిని తీసుకునేలా బిల్లులో ఉంది. ఈ కమిటీ చైర్మన్‌గా ప్రధాని వ్యవహరిస్తారు. అయితే ఈ బిల్లుపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని విమర్శించాయి. ఈ బిల్లు ఆమోదం పొందితే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎన్నికల సంఘం (Election Commission) కీలుబొమ్మలా మారుతుందని పేర్కొన్నాయి.
ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ (సీఈసీ), ఇతర కమిషనర్ల (ఈసీ) నియామకాలపై తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి, లోక్‌సభలో విపక్ష నేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ సిఫార్సుల మేరకు సీఈసీ, ఈసీల నియామకాన్ని రాష్ట్రపతి చేపట్టాలంటూ తీర్పు ఇచ్చింది. అయితే తాజాగా తీసుకువచ్చిన ఈ బిల్లుతో నియామక ప్రక్రియలో తమ పట్టును పెంచుకునే దిశగా కేంద్రం సాగుతోంది. ఎన్నికల కమిషనర్ల నియామకాల గురించే కాదు, వారి జీతభత్యాల గురించి కూడా ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఇప్పటిదాకా వారి జీతాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలతో సమానంగా ఉండగా, వాటిని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శుల జీతాలతో సమానంగా మార్చాలని బిల్లులో పేర్కొంది.