ప్రపంచకప్ (World Cup) సమరానికి మరో 50 రోజుల సమయమే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మరోసారి కప్‌ను సాధించాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో గత ప్రపంచకప్ హీరో బెన్‌స్టోక్స్‌ను (Ben Stokes) తిరిగి వన్డే జట్టులోకి తీసుకువచ్చింది. అయితే అతడు 50 ఓవర్ల ఫార్మాట్‌కు గతేడాది జులైలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. పనిభారం పెరుగుతుందని వన్డేలకు గుడ్‌బై చెప్పాడు. టీ20లు, టెస్టులకు మాత్రం అందుబాటులో ఉంటానని తెలిపాడు.
కానీ, బుధవారం ఇంగ్లాండ్ ప్రకటించిన వన్డే ప్రపంచకప్ ప్రొవిషనల్ జట్టులో స్టోక్స్ పేరు ఉంది. అంతేకాదు వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లోనూ అతడు ఎంపికయ్యాడు. వచ్చే ఏడాది జనవరి వరకు టెస్టు మ్యాచ్‌లు లేకపోవడంతో తిరిగి జట్టులోకి వచ్చి ఉంటాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న స్టోక్స్ అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ప్రపంచకప్ సమరంలో ఎలా రాణిస్తాడో చూడాలి.
ఇంగ్లాండ్ ప్రపంచకప్ ప్రొవిషనల్ జట్టు: బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గస్ అట్కిన్సన్, బెయిర్‌స్టో, సామ్ కరన్, లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, అదిల్ రషీద్, జో రూట్ , జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, టోప్లే, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.
ప్రొవిషనల్ జట్టులో అన్‌క్యాపడ్ ప్లేయర్ అయిన పేసర్ అట్కిన్సన్ చోటు దక్కించుకున్నాడు. అతడు ఇప్పటివరకు 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అందులో 50 ఓవర్ల ఫార్మాట్ మ్యాచ్‌లు ఆడింది రెండు మాత్రమే. కానీ అతడి వేగమే జట్టులో చోటు దక్కేలా చేసింది. అతడు గంటకు 90 మైళ్లతో బంతులు విసరగలడు. 95 మైళ్లు అత్యధిక స్పీడ్. గాయంతో ఆర్చర్ దూరమవ్వడంతో ఈ యువ పేసర్‌కు అవకాశం వచ్చింది.