వన్డే వరల్డ్ కప్‌లో విఫలమైన పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ అజామ్ సారథిగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. అయితే ఇది బాబర్‌ది వ్యక్తిగత నిర్ణయమా, బోర్డు అతడిపై ఒత్తిడి చేసిందా అనే దానిపై క్లారిటీ రాలేదు. ప్రపంచకప్‌లో నాలుగు విజయాలే పాక్ సాధించింది. అఫ్గానిస్థాన్ చేతిలో కూడా ఓడింది. అయితే ప్లేయర్‌గా జట్టులో కొనసాగుతానని బాబర్ వెల్లడించాడు. ”2019లో పాక్ బోర్డు నుంచి కాల్ రావడం ఇప్పటికీ గుర్తు ఉంది. ఈ నాలుగేళ్ల కెప్టెన్సీ కాలంలో ఎత్తుపల్లాలు చూశాను. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఇదే కరెక్ట్ టైమ్ అనిపిస్తుంది. అన్ని ఫార్మాట్లలో సారథి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం కష్టమే. కొత్త కెప్టెన్‌కు, జట్టుకు నా అనుభవాన్ని అందిస్తా” అని బాబర్ చెప్పాడు. ఈ ప్రపంచకప్‌లో బాబర్ 320 పరుగులు చేశాడు.