లక్నో వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 209 పరుగులకే కుప్పకూలింది. జంపా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకకు గొప్ప ఆరంభం లభించింది. ఓపెనర్లు నిస్సాంక (61), కుశాల్ పెరీరా (78) శతక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరు అర్ధశతకాలతో తొలి 20 ఓవర్లలో ఆసీస్‌పై ఆధిపత్యం చెలాయించారు. తర్వాత ఆసీస్ బౌలర్లు పుంజుకొని వికెట్ల వేట కొనసాగించారు. దీంతో 125/0తో పటిష్ఠ స్థితిలో ఉన్న లంక.. చివరి 10 వికెట్లను 84 పరుగులకే కోల్పోయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి లంక ఓపెనర్లు, అసలంక (25) మినహా మిగిలినందరూ ఒక్క డిజిట్‌కే పరిమితమయ్యారు. జంపా నాలుగు, మిచెల్ స్టార్క్ రెండు, కమిన్స్ రెండు, మాక్స్‌వెల్ ఒక్క వికెట్ తీశారు.
అయితే లంక ఇన్నింగ్స్‌లో వరుణుడు ఎంట్రీతో కాసేపు ఆట నిలిచింది. ఈ క్రమంలో స్టేడియం సిబ్బంది కవర్స్ పట్టుకుని వస్తున్న సందర్భంలో ఆసక్తికర సంఘటన జరిగింది. మైదాన సిబ్బందికి డేవిడ్ వార్నర్ సాయం చేశాడు. వారితో పాటు కవర్స్ అందుకొని పరిగెత్తాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.