పని భారం భరించలేక ఓ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు చేసే పనిని తానొక్కడే చేస్తున్నందుకు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసిఫాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బానోత్ సురేష్ (35) విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 17 తన డ్యూటీ ముగిసిన అనంతరం బ్యాంక్‌లోనే రాత్రి 7.30 గంటలకు పురుగుమందు తాగారు. దీంతో ఆయనకు వాంతులు అయ్యాయి.
ఇది గమనించిన బ్యాంకు సిబ్బంది అతడిని ప్రశ్నించగా ఆరోగ్యం బాగోలేదని ఆయన బదులిచ్చారు. అయితే సిబ్బంది వెంటనే అసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పుత్రికి తరలించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. అయితే మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు మంచిర్యాల ఆస్పుత్రిలో చేర్చాలని సూచించారు. దాంతో కుటుంబ సభ్యులు మంచిర్యాలకు తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పుత్రికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సురేష్ మృతిచెందారు. అయితే బ్యాంకులో పనిఒత్తిడి ఎక్కువైందని భార్య ప్రియాంకతో చెబుతుండే వాడని సురేష్ తండ్రి లక్ష్మీరాజ్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు చేసే పనిని చేస్తుండటంతో ఆ మనస్తాపంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని ఆయన తెలిపారు.