AsiaCup2023- ప్రత్యర్థి కోసం వెయిటింగ్‌.. ఫైనల్లో భారత్‌

శ్రీలంకపై 41 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించి ఆసియాకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్పిన్‌ పిచ్‌పై ఇరుజట్ల మధ్య పోరు ఉత్కంఠగా సాగినా.. అంతిమంగా టీమిండియానే పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ రోహిత్ శర్మ (53; 48 బంతుల్లో) టాప్‌ స్కోరర్‌. అనంతరం ఛేదనకు దిగిన లంక 41.3 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి 99 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును డిసిల్వా (41), వెల్లలాగే (42*) ఆదుకున్నారు. ఇద్దరూ ఏడో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. విజయం దిశగా సాగుతున్న ఆ జట్టును కుల్‌దీప్‌ (4/43), జడేజా(2/33) దెబ్బతీశారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా రెండు, సిరాజ్‌, హార్దిక్‌ ఒక వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం లభించింది. 11 ఓవర్లకు 80/0తో ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించింది. దీంతో మరోసారి భారత్‌ భారీస్కోరు సాధిస్తుందని భావించారంతా. కానీ తర్వాత సీన్‌ మారిపోయింది. లంక స్పిన్నర్లు సత్తాచాటి స్కోరును కట్టడిచేశారు. భారత్‌ 91/3తో నిలిచిన సమయంలో క్రీజులోకి వచ్చిన రాహుల్.. ఇషాన్‌ కిషాన్‌(33)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. కానీ లంక బౌలర్లు మరోసారి బంతిని తిప్పుతూ టీమిండియాను ఇబ్బంది పెట్టారు. ఆఖర్లో అక్షర్‌ పటేల్ (26) పరుగులు చేయడంతో భారత్‌ 200 మార్క్‌ను దాటింది. పది వికెట్లు స్పిన్నర్లే పడగొట్టారు. అయితే లంకపై రోహిత్‌ సేన విజయంతో బంగ్లాదేశ్‌ ఫైనల్‌ ఆశలకు బ్రేక్‌ పడింది. గురువారం జరిగే శ్రీలంక-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో విజేతతో టీమిండియా ఫైనల్‌లో ఆదివారం తలపడనుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం