ఆసియాకప్ (Asia cup)లో పాల్గొనేందుకు టీమిండియా శ్రీలంకకు చేరింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కప్‌ను సాధించాలని అభిమానులు భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. పాకిస్థాన్-నేపాల్ మ్యాచ్‌తో నేటి నుంచే ఆసియా కప్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ టీమిండియా లంకకు చేరుకుంది. కొలంబో ఎయిర్‌పోర్టులో భారత జట్టు ఆటగాళ్లకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిమానులకు అభివాదం చేశారు.
ఆసియాకప్ గ్రూప్ స్టేజ్‌లో భాగంగా పాకిస్థాన్‌తో భారత్ శనివారం తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఆ రోజు ఉదయం, మధ్యాహ్నం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా మ్యాచ్ ముందు రోజు రాత్రి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు చెప్పింది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కాగా, చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు ఆఖరిసారిగా 2022 టీ20 ప్రపంచకప్‌లో చూశారు. ఆ పోరులో విరాట్ సంచలన ఇన్నింగ్స్‌తో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత సెప్టెంబర్2వ తేదీన ఇరు జట్లు తలపడనున్నాయి.