ఆగస్టు 23 నుంచి అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యాత్రికుల సంఖ్య తగ్గడం, ట్రాక్ పునరుద్ధరణ పనుల కారణాలతో యాత్రను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు అమర్‌నాథ్ యాత్రకు కేంద్రం ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో, భూమికి 3,880 మీటర్ల ఎత్తులో అమర్‌నాథ్ ఆలయం ఉంది. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 4.4 లక్షల మంది యాత్రికులు పుణ్యక్షేత్రాన్ని దర్శించారు.
“యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. యాత్రకు వెళ్లే అనంతనాగ్ జిల్లా పహల్గామ్, గండర్బాల్ జిల్లా బల్టాల్ మార్గాల్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అత్యవసర మరమ్మతులు చేస్తోంది. దీని కారణంగా ఆ మార్గాల్లో యాత్రికులు వెళ్లడం శ్రేయస్కరం కాదు. ఆగస్టు 23 నుంచి రెండు మార్గాల్లో యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం” అని అధికారులు తెలిపారు. కాగా, ఆగస్టు 31న చాడీ ముబారక్ కార్యక్రమంతో యాత్ర ముగుస్తుంది.